top of page
MediaFx

121 కి చేరిన మృతుల సంఖ్య.. హత్రాస్ దారుణంపై నొరు విప్పిన బోలే బాబా..


ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. 38 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్పత్రి బయట కుటుంబ సభ్యల రోదనలు మిన్నంటాయి. మంగళవారం హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 80వేల మందికే అనుమతి ఇచ్చారు కానీ.. 2.5 లక్షల మంది వరకు తరలివచ్చారు. తన ప్రవచనాలు ముగించుకొని భోలే బాబా వెళ్లిపోయే సమయంలో…ఆయన పాదదూళికల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి.. పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఘటనకు కారణమైన సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు… బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసుల వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో హాథ్రస్‌ ఘటనపై భోలే బాబా నోరు విప్పాడు.. తన వ్యక్తిగత లాయర్‌ ద్వారా లేఖ విడుదల చేశారు.. తొక్కిసలాట వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపిచారు. దర్యాప్తునకు సహకరిస్తానని భోలే బాబా తెలిపారు. కావాలనే ఎవరో కుట్ర చేశారని.. తాను వెళ్లిపోయాకే తొక్కిసలాట జరిగిందంటూ పేర్కొన్నారు. కాగా.. తొక్కిసలాట జరిగినప్పుడు బాబా అక్కడే ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది.. భక్తులను అతని వ్యక్తిగత సిబ్బంది తోసివేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు హాథ్రస్‌ విషాద ఘటనపై న్యాయ విచారణ జరిపించ‌నున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ జ్యుడీషియ‌ల్ విచారణ కమిటీలో రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి, పోలీసు అధికారులు ఉంటార‌ని వెల్లడించారు. ఈ మహావిషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు మొదలుపెట్టామన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్‌. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. ఇంత‌మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేదేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.హాథ్రస్‌ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.

bottom of page