వర్షాకాలం వస్తూ వస్తూ వైరస్‌లను వెంటబెట్టుకుని వస్తుందంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల వైరల్‌ఫీవర్స్, డెంగీ పంజా విసురుతుండటంతో తాజాగా జికా వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు అక్కడ ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తి నివారణకు పుణె మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదయింది. 46 ఏండ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిపడ్డారు. అనంతరం అతని కుమార్తెకు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నలుగురితోపాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.