యావత్ ప్రపంచం ఏదో ఒక రూపంలో ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ఈ ముప్పు దశాబ్దాలుగా ఉంది. భారత్‌లో విధ్వంసాలు సృష్టించి అశాంతి నెలకొల్పడం, ఆర్థికంగా పతనం చేయడమే తమ ఏకైక విదేశీ విధానంగా పొరుగుదేశం పాకిస్తాన్ పెంచిపోషించిన సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని అనేక నగరాలు ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయి. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్‌పైనే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ ఘటనలను దేశం చూసింది. ముంబై మారణహోమం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబ్ కారణంగా పాకిస్తాన్ పన్నాగం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇలాంటి వరుస ఉగ్రవాద దాడులతో దేశంలోని ఏమూల ఏక్షణం ఏ బాంబు పేలుతుందోన్న భయం ప్రజల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రజలు రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితులు ఉండేవి.
ఈ ఉగ్రవాదం సృష్టించే భయోత్పాతం మనుషుల ప్రాణాలకే కాదు, యావద్దేశ ఆర్థిక పురోగతికే ప్రమాదంగా మారింది. అయితే ఇదంతా గతం. భద్రతా బలగాల కళ్లుగప్పి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దులు దాటి వచ్చే సీమాంతర ఉగ్రవాదులైనా, పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలోనే ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించే సంస్థలైనా భారత ప్రభుత్వ చర్యలతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే భారత్‌లో విధ్వంసాలకు పథక రచన చేసే అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు అనూహ్యంగా అంతమైపోతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పులకు గురవుతున్నారు. ఆ గుర్తుతెలియని వ్యక్తులు ఎవరన్నది భారత ప్రజలందరికీ తెలుసు. “భారత్‌లో విధ్వంసానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే.. ఎక్కడున్నా సరే.. ఇంట్లోకి దూరి మరీ లేపేస్తాం (ఘర్ మే ఘుస్‌గే మారేంగే)” వంటి వ్యాఖ్యలు భారత ప్రధాని నోటి నుంచి వస్తున్నాయి. ఇవి కేవలం మాటలే కాదు, చేతల్లోనూ జరుగుతోందని అని చెప్పేలా పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక శక్తులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే విధానంగా..
ప్రధాని మోదీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై సైతం ఉగ్రవాదంపై తమ వైఖరిని చాటిచెబుతూ వచ్చారు. భారత్‌లో కాంగ్రెస్ అనుసరించిన విధానాలనే కాదు, ప్రపంచ నేతల ఆత్మవంచనను కూడా పలు సందర్భాల్లో ఎండగట్టారు. జీ-20 సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఉగ్రవాదం అతి పెద్ద సవాల్ అన్న విషయాన్ని ప్రపంచం ఇప్పుడు గ్రహిస్తోంది. ఏ కారణంతోనైనా, ఏ రూపంలోనైనా సరే ఉగ్రవాదం మానవత్వానికి వ్యతిరేకం. అలాంటప్పుడు మనమంతా ఉగ్రవాదంపై కలసికట్టుగా కఠినంగా వ్యవహరించాలి. అయితే ఉగ్రవాదానికి నిర్వచనం విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం దురదృష్టకరం” అన్నారు. బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ.. “ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ వంటివి కేవలం ప్రాంతీయంగానో, ఒకట్రెండు దేశాలతో పరిమితమైన సమస్య కాదు. ఇవి యావత్ ప్రపంచ శాంతికి విఘాతం కల్గించే అంశాలు. వాటి కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. మానవత్వానికే పెను ముప్పుగా మారుతోంది. ఈ ముప్పుపై మనమంతా కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అన్నారు. ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు జరిగే మారణాయుధాల సరఫరా, ఇతర సాంకేతిక సహకారంపై కూడా దృష్టి పెట్టి అడ్డుకోవాలని కోరారు. ఉగ్రవాదులను పెంచి పోషించి, ఆర్థిక, ఆయుధ వనరులు సమకూర్చే దేశాలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం అని నొక్కి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో 2016లో అమెరికా పర్యటన చేపట్టిన మోదీ.. న్యూక్లియర్ సెక్యూరిటీ (అణు భద్రత) అంశంపై జరిగిన చర్చలో సైతం ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. “ఉగ్రవాదం కొన్ని సరిహద్దులకు లోబడి లేదు. ఇదొక గ్లోబల్ నెట్‌వర్క్. కానీ దాన్ని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు, దేశ స్థాయిలోనే ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఉగ్రవాదంపై ప్రపంచస్థాయిలో పోరాటం జరగితే తప్ప ఆ ముప్పును అడ్డుకోలేం. ఉగ్రవాదాన్ని అరికట్టకుండా అణు ఉగ్రవాదం ముప్పును తొలగించలేం. ఉగ్రవాదం మన సమస్య కాదు అని ఎవరూ అనుకోడానికి వీల్లేదు. ఉగ్రవాదానికి తన, మన భేదాల్లేవు” అంటూ లోతుగా సమస్యను విశ్లేషించారు. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో కూడా పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తూ కాశ్మీర్ లోయలో అశాంతి సృష్టిస్తుందో వివరించారు. ఇలా ఒక అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మాట్లాడుతూ వచ్చారు. ఉగ్రవాదంపై భారత వైఖరి కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి ప్రణాళికతో సంయుక్త కార్యాచరణతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం సహా ఏ రూపంలో సహాయం అందకుండా చూడాలని మోదీ గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. వాటి ఫలితమే ఉగ్రవాదుల ఖార్ఖానా పాకిస్తాన్‌లో కూర్చుకుని భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు వరుసగా హతమవడం.