top of page
MediaFx

పాలిచ్చే ఆవులను కరిచిన పిచ్చికుక్క.. ఆవు పాలను ఊరి జనానికి అమ్మిన యజమాని..


ఛత్తీస్‌గఢ్‌లోని గోండహూర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఓ గ్రామంలో ఓ పిచ్చి కుక్క పాలిచ్చే రెండు ఆవులను కరిచింది. ఇది జరిగిన సుమారు రెండు నెలల తర్వాత ఈ రెండు ఆవులు రేబిస్‌ బారిన పడి మృతి చెందాయి. ఈ విషయం తెలియని ఆవుల యజమాని.. పాలను గ్రామంలోని స్థానికులకు విక్రయించాడు. అయితే తాజాగా అవులు మృత్యువాత పడటంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వైద్యారోగ్య శాఖ బృందం గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి.. ఆవులను పాలను వినియోగించిన గ్రామస్తులందరికీ రేబిస్ ఇంజక్షన్లు వేశారు. అయితే ఆవులను పిచ్చికుక్కలు కరిచిన విషయం పశువుల యజమానికి ముందే తెలుసునని, అందుకే రహస్యంగా ఆసుపత్రికి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేసుకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. రేబిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆనోటా.. ఈనోటా పడటంతో ఆవు పాలు తాగడం, స్వీట్లు తినడం గ్రామంలో నిషేధించారు. రేబిస్‌ వ్యాపిస్తుందన్న భయం గ్రామస్తుల్లో నెలకొనడంతో ఈ విషయం కాస్తా టాక్‌ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామస్థులందరికీ రేబిస్‌ వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని పంఖజూర్‌లోని వివేకానంద గ్రామ పంచాయతీకి చెందిన పివి-4 గ్రామంలో చోటు చేసుకుంది.

ఈ గ్రామంలో పాల డెయిరీ పనులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ గ్రామంలోని వారు ఎక్కువగా పశువులను పెంచుతుంటారు. ఇళ్లలో పాలు పిండి అమ్ముతుంటారు. ఇదే గ్రామానికి చెందిన ఓ పాడి రైతుకు రెండు పాలిచ్చే ఆవులు ఉన్నాయి. రెండు నెలల క్రితం ఈ ఆవులను గ్రామంలో ఓ పిచ్చి కుక్క కరిచింది. ఈ ఘటన తర్వాత కూడా సదరు రైతు ఆవుల పాలను యథావిధిగా విక్రయించడం ప్రారంభించారు. అయితే రెండు నెలలకే రెండు ఆవులకు రేబిస్ వ్యాధి సోకి చనిపోయాయి. రైతు మాత్రం సైలెంగ్‌గా ఆసుపత్రికి వెళ్లి ఎవరికీ చెప్పకుండా రేబిస్ ఇంజెక్షన్ వేయించుకున్నాడు. పిచ్చి కుక్క కాటుకు గురై చనిపోయిన ఆవుల పాలను రైతు అదే గ్రామంలోని మూడు బెంగాలీ కుటుంబాలకు విక్రయించారు. ఇటీవల వారి ఇళ్లల్లో సత్యనారాయణ కథ కార్యక్రమం జరగడంతో.. పాలతో ప్రసాదం తయారు చేశారు. ఆవు పాలతో స్వీట్లు తయారు చేసి గ్రామమంతా పంపిణీ చేశారు. దీంతో ఆ ప్రసాదాన్ని ఊరి జనమంతా తిన్నారు. ఆ తర్వాత ఆవులు చనిపోయాయనే వార్త దావానంలా గ్రామం అంతా పొక్కడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయం కాస్తా ఆరోగ్య శాఖకు చేరడంతో.. అధికారులు ఆ గ్రామంలో హడావుడిగా క్యాంపు ఏర్పాటు చేసి, గ్రామస్తులందరికీ రేబిస్ వ్యాక్సినలు వేశారు.

bottom of page