రీమేక్ మూవీస్ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలలో ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, కమల్‌హాసన్, రజనీకాంత్‌తో పాటు స్టార్ హీరోలందరూ ఈ రీమేక్ సినిమాలు చేసినవాళ్లే. అయితే కొందరు స్టార్ హీరోలు మాత్రం రీమేక్‌ల జోలికి వెళ్లడం లేదు. రీమేక్‌లు వద్దు స్ట్రెయిట్ సినిమాలే ముద్దు అని చెబుతున్నారు. ఆ హీరోలు ఎవరంటే...
మహేష్‌బాబు రీమేక్‌లకు దూరం...
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్న మహేష్ బాబు కెరీర్ ఆరంభం నుంచి రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు హీరోగా మహేష్‌బాబు 28 సినిమాల్లో నటించాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేకపోవడం గమనార్హం. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే రీమేక్ సినిమాలు చేయకూడదనే రూల్ పెట్టుకున్నాడు మహేష్‌బాబు. ఆ రూల్‌ను ఇప్పటికీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాడు.
గతంలో దళపతి విజయ్ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ మహేష్‌బాబుకు వచ్చింది. అలాగే బాలీవుడ్ మూవీ త్రీ ఇడియట్స్‌ను మహేష్‌బాబుతో తెలుగులో రీమేక్ చేయాలని కొందరు ప్రయత్నించారు. కానీ రీమేక్ సినిమాల రూల్ కారణంగా కత్తి, త్రీ ఇడియట్స్‌ను మహేష్‌బాబు తిరస్కరించాడు. కంపేరిజన్స్ వస్తాయనే భయంతోనే తాను రీమేక్ లకు దూరంగా ఉంటున్నట్లు గతంలో మహేష్ బాబు వెల్లడించాడు.
విజయ్ దేవరకొండ కూడా...
మహేష్‌బాబుతో పాటు మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పటివరకు రీమేక్ సినిమాలో నటించలేదు. పెళ్లిచూపులుతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అన్ని స్ట్రెయిట్ సినిమాలే చేస్తూ వచ్చాడు. రీమేక్‌ల జోలికి మాత్రం వెళ్లలేదు. భవిష్యత్తులో రీమేక్‌లు చేయకూడదనే రూల్‌కు అతడు కట్టుబడి ఉంటాడో లేదో అన్నది చూడాల్సిందే.
45 సినిమాలు...నో రీమేక్స్...
మలయాళ విలక్షణ హీరో దుల్కర్ సల్మాన్ 2012లో రిలీజైన సెకండ్ షో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు హీరోగా 45కుపైగా సినిమాలు చేశాడు. ఇందులో ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేదు. అతడు హీరోగా నటించిన పలు మలయాళ సినిమాలు ఇతర భాషల్లో రీమేకయ్యాయి. కానీ దుల్కర్ మాత్రం ఇతర హీరోల సినిమాలు రీమేక్ చేయలేదు. స్ట్రెయిట్ కథలతోనే సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. రీమేక్ లలో అవకాశాలు వచ్చిన కూడా నిర్మొహమాటంగా తిరస్కరించాడు.
రక్షిత్ శెట్టి...
కన్నడ హీరో , సప్త సాగర దాచే ఎల్లో ఫేమ్ రక్షిత్ శెట్టి కూడా రీమేక్ సినిమాల్లో నటించకూడదనే పాలసీ పెట్టుకున్నాడు. 14 ఏళ్ల కెరీర్‌లో అన్ని స్ట్రెయిట్ సినిమాలే చేశాడు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ రీమేక్ చేశాడు.
టాలీవుడ్ హీరో నితిన్ కూడా రీమేక్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్ సినిమాను మాస్ట్రో పేరుతో తెలుగులోకి రీమేక్ చేశాడు. నితిన్ కెరీర్‌లో చేసిన ఒకే ఒక రీమేక్ మూవీ ఇదే. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.