అదే నరాలు తెగే ఉత్కంఠ.. మునివేళ్లపై నిలబెట్టే టెన్షన్.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలో అచ్చం అలానే అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ ఆవిష్కృతమైంది. టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. దాయాది దేశం చారిత్రాత్మక విజయాన్ని లిఖించింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత పోరులో 6 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 కీలక వికెట్లతో చెలరేగిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గెలుపు అవకాశాలు 8 శాతమే..అయినా వదల్లేదు..
120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేశారు. పరుగులు తక్కువగానే ఉన్నప్పటికీ వికెట్లు కోల్పోకుండా ఆడారు. 11.5 ఓవర్లలో 71/2 స్కోర్‌తో పాకిస్థాన్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం గెలుపు అవకాశాలు భారత్‌కు 8 శాతం, పాకిస్థాన్‌కు 92 శాతంగా ఉన్నాయి. దీంతో పాక్ గెలుపు ఇక సునాయాసమేనని అనిపించింది. కానీ భారత బౌలర్లు పట్టు వదలకుండా ఆత్మవిశ్వాసంతో ఆడారు. కీలక సమయంలో వికెట్లు తీసి.. పరుగులు నియంత్రించి మ్యాచ్ విజయం కోసం రేసులోకి వచ్చారు. చివరకు ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్నారు. భారత బౌలర్లలో బుమ్రాతో పాటు మిగతా బౌలర్లు కూడా అదరగొట్టారు. ముఖ్యంగా 4 ఓవర్లు వేసిన హార్ధిక్ పాండ్యా 24 పరుగులు మాత్రమే చేసి కీలక దశలో 2 ముఖ్యమైన వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. 31 పరుగులు చేసిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫకర్ జమాన్ 13, ఇమాద్ వసీమ్ 15, షాదాబ్ ఖాన్ 4, ఇఫ్తీకర్ అహ్మద్ 5, షాహీన్ ఆఫ్రిదీ 0 (నాటౌట్), నషీమ్ షా 10(నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఓడిపోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజులో ఉన్న నషీమ్ షా కన్నీళ్లు పెట్టాడు. విలపిస్తూ మైదానాన్ని వీడాడు. మిగతా పాక్ ఆటగాళ్లు కూడా షాక్‌కు గురవడం కనిపించింది.
తడబడిన భారత బ్యాటర్లు
కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లు మాత్రమే ఆడి 119 పరుగులకు ఆలౌల్ అయింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. 42 పరుగులు చేసిన రిషబ్ పంత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ 20, కెప్టెన్ రోహిత్ శర్మ 13, కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్ 7, శివమ్ దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0, అర్షదీప్ సింగ్ 9, బుమ్రా 0, సిరాజ్ 7 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 3, హరీస్ రౌఫ్ 3, మహ్మద్ అమీర్ 2, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.