top of page
MediaFx

ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి..?


ఇజ్రాయెల్‌పై ఇరాన్‌, హెజ్బొల్లా (Hezbollah) సోమవారం నుంచే దాడులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తాజాగా వెల్లడించింది. ఈ దాడుల అంశంపై తమకు సమాచారం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తాజాగా తెలిపారు. ఈ మేరకు జీ7 దేశాల మంత్రులను హెచ్చరించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఎలా, ఏ సమయంలో ఈ దాడులు ఉండొచ్చనేది మాత్రం కచ్చితంగా తెలియదని ఆంటోనీ బ్లింకెన్‌ జీ7 దేశాల నేతలకు చెప్పినట్లు పేర్కొంది. అమెరికా అప్రమత్తం..

ఉద్రిక్తతల పెరుగుదల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా రీజియన్‌లోని తమ సిబ్బంది, ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు సైనిక మోహరింపును పెంచినట్టు అమెరికా తెలిపింది. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నట్లు తెలిపింది. మరోవైపు లెబనాన్‌ను వెంటనే వీడాలని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది. అదేవిధంగా లెబనాన్‌ను వెంటనే వీడాలని భారత్‌తోపాటు జోర్డాన్‌, ఫ్రాన్స్‌, కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీచేశాయి.

మరోవైపు.. ఇరాన్‌ మద్దతు గల లెబనాన్‌ కేంద్రంగా నడిచే హెజ్బొల్లా గ్రూపు శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ భూభాగం వైపుగా పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డోమ్‌ వ్యవస్థ అడ్డుకొన్నదని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. కాగా, రాకెట్‌ దాడుల్లో మోషవ్‌ బీట్‌ హిల్లేల్‌లో పలువురు పౌరులు గాయపడినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేపట్టామని హెజ్బొల్లా సీనియర్‌ మిలటరీ కమాండర్‌ ఒకరు తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌ నగరం బజౌరీహ్‌పై జరిపిన క్షిపణి దాడిలో కీలక హెజ్బొల్లా నేత అలీ అబ్ద్‌ హతమయ్యాడని ఇజ్రాయెల్‌ మిలటరీ వెల్లడించింది.

bottom of page