భోళా శంకర్ తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నాడు. బింబిసార ఫేం మల్లిడి విశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ఈ మెగా మూవీలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు విశ్వంభర సెట్స్ కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. మేన 4 తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాలని అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవికి ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా ఆహ్వానాన్ని స్వీకరించిన చిరంజీవి తప్పకుండా ఎల్బీ స్టేడియం ఈవెంట్ కు హాజరవుతానని మాట ఇచ్చారు. చిరంజీవిని కలిసిన వారిలో కేవీ అనుదీప్, సాయి రాజేశ్, మెహర్ రమేశ్, శ్రీరామ్ ఆదిత్య తదితర దర్శకులు ఉ్నారు. ప్రస్తుతం ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు, స్టిల్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.