top of page
MediaFx

కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 43 మంది భారతీయులు సజీవదహనం

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనంలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 43 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 21 మంది కేరళ వాసులు, మిగతావారు తమిళనాడు మరియు మహారాష్ట్రకు చెందినవారు. మిగిలిన మృతుల్లో పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, నేపాల్ జాతీయులు ఉన్నారు.

ఈ అపార్ట్‌మెంట్ భవనం కేరళకు చెందిన ఎన్బీటీసీ గ్రూప్ అధినేత కేజీ అబ్రహాం సొంతమని తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో లేబర్ క్యాంప్ కిచెన్‌లో మంటలు చెలరేగాయి. కొందరు భవనం పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నా, మంటలు వేగంగా వ్యాపించడంతో పలు కుటుంబాలు లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.

ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో చాలా మందికి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 40 మందికిపైగా గాయపడ్డారని, వీరిలో ఎక్కువ మంది భారతీయులే అని సమాచారం.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్‌లోని భారత రాయబారి ప్రమాదం ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.


bottom of page