ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం.. స్టేజ్‌వైపు దూసుకొచ్చిన దుండగుడు
- MediaFx
- Aug 31, 2024
- 1 min read
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది. శుక్రవారం పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్‌టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల 16వ తేదీ కూడా ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్(78) మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఈ ఘటనలో ప్రచార సభకు హాజరైన ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్ ఒకరు కాల్చి చంపేశారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్‌పై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ భద్రతపై రిపబ్లికన్ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.