హిందువులకు అత్యంత పవిత్రమైనది తులసి మొక్క. ఇది స్వచ్ఛతకు ప్రతిరూపం. భక్తి, జ్ఞానోదయానికి చిహ్నం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేసి చాలా మంది దీపం వెలిగిస్తారు. ఇది పరిసరాలను శుద్ధి చేస్తుందని, కుటుంబానికి దైవిక ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్ముతారు. అయితే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించడం వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది.
తులసి లక్ష్మీ దేవత స్వరూపంగా భావిస్తారు. శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. తులసి ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు, కథలలో పేర్కొన్నారు. స్కంద పురాణం ప్రకారం తులసి మొక్క నాటి దాని దగ్గర దీపం వెలిగించడం, మొక్కను సంరక్షించడం, పూజించడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మోక్షం పొందుతారు. అలాగే పద్మ పురాణం కూడా తులసి మొక్కను ఎలా పూజించాలి? దీని వల్ల కలిగే ఫలితాల గురించి వివరించింది. తులసి మొక్కను పూజించడం వల్ల పితృదేవతలకు విముక్తి లభిస్తుందని కూడా చెబుతారు.
సాయంత్రం దీపం ఎందుకు పెడతారు?
తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించడం వెనుక ఒక కారణం ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక రుషిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన సొంత చర్యల వల్ల అపవిత్రురాలిగా మిగిలిపోయింది. ఆమె ప్రవర్తన, మర్యాద భర్తకి ఎప్పటికీ నచ్చలేదు. దీంతో ఆమె అడవుల పాలైంది. విపరీతమైన అనారోగ్యానికి గురైంది. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది.
ఆమె అక్కడ నివసించేటప్పుడు ఇతర స్త్రీలు అనుసరించే ఏ ఆచారాలలోనూ పాల్గొనలేదు. కానీ ఒకరోజు కొంతమంది అమ్మాయిలు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ప్రార్థించడం చూసింది. ఆపై సాయంత్రం వేళ ఆమె కూడా అదే పని చేసింది. తులసి మొక్క దగ్గర దీపం పెట్టింది. దురదృష్టవశాత్తు అదే రోజు ఆమె అనారోగ్య సమస్యలతో మరణించింది. ఆమెను తీసుకువెళ్లేందుకు యమభటులు వస్తే ఆమె నరకానికి వెళ్ళదని వైకుంఠానికి వస్తుందని చెబుతారు. అందుకు కారణం ఆమె మహా విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల ఆమె సర్వ పాపాలు తొలగిపోయి స్వర్గలోకానికి ప్రవేశం లభించిందని చెప్తారు. అందుకే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం మంచిదని అంటారు.