ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండువారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినబాట పట్టారు. ఢిల్లీకి వెళ్ళగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. దాదాపు గంటపాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అమిత్‌షాతో భేటీకి సంబంధించిన విషయాలు వెల్లడించారు చంద్రబాబు. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదుపు తప్పిన అస్థిరమైన అప్పుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. దీనిపై విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలపైనా అమిత్‌షాతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ అసమర్థత, నిర్వహణ లోపం, అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. పునరుద్ధరణ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పెడతాయన్నారు. కేంద్రంతో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీంతోపాటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చంద్రబాబు ప్రధాని మోదీతోపాటు .. కేంద్రమంత్రులతో భేటీ అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.. ఇవాళ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్దికి కావల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఙప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేకంగా కేంద్రపెద్దలను చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని కోరనున్నట్లు సమాచారం. దీంతో పాటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ఢిల్లీపెద్దలను బాబు కోరనున్నారు.