top of page

SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!

MediaFx

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో అవతవకలు జరిగాయంటూ ఉప్పల్ స్టేడియం బయట పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. 30 నిమిషాల్లోనే 36 వేల టికెట్లు అమ్మడవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయాల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని, టికెట్లన్నింటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తీరును తప్పుబడుతూ ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, స్థానికులు ఉప్పల్ స్టేడియం ముంగిట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉప్పల్ వేదికగా గురువారం(ఏప్రిల్) జరగాల్సిన సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ హెచ్చరించింది.టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత పాటించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. దాంతో స్టేడియం చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు.

మరోవైపు హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌ టికెట్ల కోసం ఫుల్‌డిమాండ్ ఏర్పడిందని, సాధారణ అభిమానుల నుంచి సెలెబ్రిటీలు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం టికెట్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని, 36 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని హెచ్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్లు రాని వారు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు.


bottom of page