ఘనంగా వనదేవతల జాతర..
- MediaFx
- Jun 20, 2024
- 1 min read
అల్లూరి సీతారామరాజు జిల్లా పిఆర్పురం మండలం రేకపల్లిలో వనదేవతల ఉత్సవం వైభవంగా జరిగింది. మేళతాళాల, డప్పుల సందడి, భక్తుల జయజయధ్వానాలతో వనదేవతలు ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై కొలువుదీరిన వేళ వేలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వన దేవతల ఆశీస్సులతో నిప్పులగుండాన్ని తొక్కడానికి పోటీపడ్డారు. నాయకపోడు, కొండరెడ్లు సంయుక్తంగా రెండేళ్లకో సారి ఈ జాతర 10 రోజులపాటు నిర్వహిస్తారు. చివరి మూడురోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తారు. గత ఆదివారం దారపల్లి, కొటారు గొమ్ము గ్రామాల నుంచి పెద్దసార్లమ్మ, చిన్న సార్లమ్మలను ఈ గద్దె మీద ఉంచారు. అనంతరం అడవికి వెళ్లి సరుగులు తీసుకొచ్చి గ్రామంలో ఊరేగించారు. రాత్రి పూజలు చేసి, వాటిని నిప్పులగుండంగా మార్చారు. మంగళవారం ఉదయం గద్దెలపైన ఉన్న వన దేవతలను ఊరేగించారు. వనదేవతల ఊరేగింపులో భక్తులు, నిర్వాహకులు గ్రామస్థులు నీళ్లబిందెలతో స్వాగతం పలుకుతూ, మంగళహారతులు పట్టారు. అనంతరం గద్దె వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న నిప్పులగుండంపైన వనదేవతల ప్రతిమలతో పూజారులు పాండురాజు, సూట్రూ పోతిరెడ్డి, అందెల అచ్చిరెడ్డి ముందుగా నడిచారు. తరవాత కొందరు భక్తులు, ఉత్సవ నిర్వాహకులు నడిచారు. మండల ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల మండలాల భక్తులు పాల్గొన్నారు. రేఖపల్లి నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించారు.