top of page
Suresh D

రూ.లక్ష కోట్ల బ్యాంక్‌ స్కాం.. మరణ శిక్ష విధించిన కోర్టు..!

మన దేశంలో అయితే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టినా.. బడాబాబులు విదేశాల్లో దర్జాగా తిరుగుతారు. కానీ వియత్నం లాంటి దేశాల్లో ఆ పప్పులేం ఉడకవ్‌.. ఆ దేశ ప్రభుత్వాలు గాలెం వేసి పట్టి మరీ శిక్షిస్తారు. తాజాగా వియత్నాంకి చెందిన దిగ్గజ వ్యాపార వేత్త ట్రూంగ్‌ మై లాన్‌.. ఆ దేశ బ్యాంకును రూ.లక్ష కోట్లకు పైగా మోసం చేసినందుకుగానూ అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు గురువారం (ఏప్రిల్‌ 11) తీర్పు వెలువరించింది.

ఎవరీ ట్రూంగ్‌ మై లాన్‌..

వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఛైర్మన్‌గా కొనసాగుతోంది. అయితే వియత్నాంలోనిసైగాన్ కమర్షియల్ బ్యాంక్ (SCB) నుంచి ఆమె పదేళ్ల కాలంలో దాదాపు12.5 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లు) సంబంధించి మోసాలకు పాల్పడినట్లు రుజువైంది. ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. వియత్నం దేశంలోని అతిపెద్ద స్కాంలలో ఇది ఒకటి. దీంతో కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ఆ దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. లాన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 85 మంది దోషులను ఐదు వారాలపాటు విచారించారు. లాన్‌ సహా నిందితుల జాబితాలో మాజీ సెంట్రల్ బ్యాంకర్లు, మాజీ ప్రభుత్వ అధికారులు, మాజీ SCB అధికారులు ఉన్నారు. అధికార దుర్వినియోగం, లంచం, బ్యాంకింగ్‌ చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలు వీరిపై వచ్చాయి.

ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (SCB)లో దాదాపు 90 శాతం వాటా ఉంది. కొన్నేళ్లుగా ఆమె వియత్నాంలోని ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపార వేత్తలు లక్ష్యంగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి 2012 నుంచి 2022 మధ్య SCB బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకుపైగా ఆమె కాజేసింది. ఇది ఆ దేశ జీడీపీలో 3 శాతం. 2022లో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో ఆమెను అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ స్కాం వల్ల దాదాపు 42 వేల మంది నష్టపోయారు. దీంతో ఈ వ్యవహారం ఆగ్నేయాసియా దేశమంతటా షాక్‌కు గురి చేసింది. ఇందుకు గానూ SCB అధికారులు 5.2 మిలియన్‌ డాలర్లు లంచంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

bottom of page