top of page
Suresh D

అవార్డును అముకున్న విజయ్ దేవరకొండ..?🎥🏆

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు, తమకు సామాజిక బాధ్యత కూడా ఉందని గతంలో ఎంతో మంది హీరోలు రుజువు చేశారు. ఏ ఆపద వచ్చినా తమకు తోచిన సాయం అందించడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. సినిమా రంగానికి చెందిన కొందరు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. వారిని పక్కన పెడితే.. తాము సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ హీరోలమే అనిపించుకుంటున్నారు కొందరు హీరోలు. వారిలో విజయ్‌ దేవరకొండ ఒకరు. ఆమధ్య తను హీరోగా నటించిన ‘ఖుషి’ చిత్రం ప్రమోషన్స్‌లో 100 మందికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తానంటూ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చెప్పినట్టుగానే సాయాన్ని అందించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. అంతేకాదు, ఇలాంటి ఒక కార్యక్రమాన్ని గతంలోనే చేశాడని చాలా మందికి తెలీదు. విజయ్‌ దేవరకొండను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికిగాను ఉత్తమనటుడిగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నాడు. 2018లో అతనికి ఈ అవార్డు వచ్చింది. దాన్ని 2018లోనే అమ్మేశాడు. అవార్డును అమ్మడం ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. కానీ, ఇది నిజం. తన కెరీర్‌లో లభించిన పెద్ద అవార్డు అది. అయినా దాన్ని ఇంట్లో దాచిపెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని, దాన్ని ఒక మంచి పని కోసం ఉపయోగిస్తే బాగుంటుందని భావించిన విజయ్‌ దాన్ని ఆక్షన్‌లో పెట్టాడు. 

తన అవార్డుకి రూ.5 లక్షలు వస్తాయని భావించాడు. కానీ, దివి ల్యాబ్స్‌ వారు దాన్ని రూ.25 లక్షలకు సొంతం చేసుకున్నారు. దివి ల్యాబ్స్‌ ఫ్యామిలీ సభ్యురాలు శ్యామలాదేవి ఈ అవార్డును దక్కించుకున్నారు. అలా వచ్చిన పాతిక లక్షలను వెంటనే సి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌కి విరాళంగా ఇచ్చేశాడు విజయ్‌. ఆ డబ్బుతో కొంతమందికైనా ఉపశమనం కలుగుతుందని భావించిన అతని ఔదార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇలా తనకు వచ్చిన అవార్డును వేలం వేయడం అనేది అప్పట్లో సంచలనమే సృష్టించింది. తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు విజయ్‌. ఈ క్రమంలోనే ఆరేళ్ళ క్రితం జరిగిన ఈ ఆక్షన్‌ గురించి ప్రస్తావన వచ్చింది. మనకు వచ్చిన అవార్డులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, దాని వల్ల నలుగురికి మేలు జరిగితే అంతకంటే కావాల్సింది ఏముందని విజయ్‌ వ్యాఖ్యానించాడు. ఆ ఆక్షన్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయం చాలా మంది ఫ్యాన్స్‌కి తెలీదు. ఇప్పుడా ఆ ఆక్షన్‌ గురించి తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. విజయ్‌ దేవరకొండను ప్రశంసలతో ముంచెత్తుతూ అతనికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.🎥🏆 

bottom of page