వినేశ్‌పై అనర్హత వేటు.. పీటీ ఉషకు ప్రధాని ఫోన్.. కీలక సూచన
- MediaFx
- Aug 7, 2024
- 1 min read
140 కోట్లమంది భారతీయుల గుండె పగిలింది. ఒక ధీశాలికి అన్యాయం జరిగింది. రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళ గోల్డ్ కొడుతుందనే లోపే.. పోటీకి దూరమైంది. బుధవారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. వెయిట్ చెక్ చేయగా.. ఆమె 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌ను డిస్ క్వాలిఫై చేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తీరును భారత్ తీవ్రంగా ఆక్షేపించింది.
వినేష్ ఫోగట్ అనర్హతపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “వినేష్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నువ్వు దేశానికి గర్వకారణం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ప్రదాతవు. ఇవాళ్టి పరిణామం బాధపెడతోంది. సవాళ్లను ఎదుర్కోవడం నీ నైజం. మరింత బలంతో నువ్వు పోరాడాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఫోగట్ అనర్హత అంశంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వినేష్ అనర్హతపై తదుపరి ఏం చేయవచ్చని వాకబు చేశారు. అవసరమైతే ఈ అనర్హతపై నిరసన తెలపాలని PT ఉషకు ప్రధాని మోదీ సూచించారు.
వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడటంపై లోక్‌సభలో విపక్షం భగ్గుమన్నది. ఈ అంశంపై చర్చించడానికి విపక్షం పట్టుబట్టింది. ఫైనల్లో ఫోగట్ పోటీపడలేకపోవడంపై.. విచారణ జరగాలి.. నిజానిజాలు బయటకు రావాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఈ నిర్ణయం దేశాన్ని అవమానించినట్లే అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు. యావత్ దేశం ఫోగట్ వెంట ఉందన్నారు. ఈ అంశంపై వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. మాట వినకుంటే ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే ఫోగట్ అనర్హతపై మధ్యాహ్నం 3 గంటలకు క్రీడల మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది.
వినేష్ ఫోగట్‌కు అస్వస్థత
వినేష్ ఫోగట్‌కు అస్వస్థత గురయ్యారు. దీంతో ఆమెను పారిస్ ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు అధికారులు. డీ హైడ్రేషన్‌తో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. బరువు తగ్గడానికి రాత్రంతా వినేశ్ ఫోగట్ కఠోర సాధన చేసినట్లు తెలిసింది. స్కిప్పింగ్.. జాగింగ్.. సైక్లింగ్ చేసి.. రాత్రికి రాత్రే.. కేజీకి పైనే తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.