మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన వైవిధ్యమైన పాత్రలు మరియు మాస్ పాత్రలతో తెలుగు సినీ ప్రేమికులలో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో ప్రతిభగల ఈ కథానాయకుడు ఇటీవల 'గామి'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడినందున, ఈ చిత్రాన్ని 2024 మే 17న వేసవి సెలవులకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఈ చిత్రంలో అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రతిభగల నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. 1960 లలో గోదావరి జిల్లాలలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన హింసాత్మక పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు.
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుండి విడుదలైన ''సుట్టంలా సూసి'' మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో 48 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి, సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది. విశ్వక్ సేన్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ఖరారు చేసి వారిలో ఉత్సాహం నింపారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, పృధ్వీ యాక్షన్ సీక్వెన్స్‌ల బాధ్యత చూస్తున్నారు. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.