కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో, రికార్డు సమయంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించి మేజర్ సీతా షెల్కే వార్తల్లో నిలిచారు. ఇండియన్ ఆర్మీ వారి మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్‌కు చెందిన మేజర్ సీతా షెల్కే సహాయక చర్యలలో చురుకుగ్గా పాల్గొన్నారు. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిలిచింది. కేరళలోని వయనాడ్‌లో కేవలం16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. వంతెన నిర్మాణం జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 1 సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది.
మేజర్ షెల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ల మధ్య వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా శ్రమించింది. తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం, వేగవంతం చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం, సీతా షెల్కే చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు. ఇంకా పలువురు సైనికాధికారులు, నెటిజన్లు ఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు.