ఇండియా కూటమిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పాత్రపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాము కూటమిలో ఉన్నామని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు.
‘‘కూటమికి బయట నుంచి లేదా లోపలి నుంచి మద్దతు ఇచ్చి ఆమె ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని మీరు ఆమెనే అడగండి. మేము ఆమెను నమ్మము. ఆమె స్వయంగా కూటమిని వీడారు. ఇప్పుడామే బీజేపీ వైపు కూడా వెళ్లొచ్చు. ఇండియా కూటమిపై ఆమెకు ఏ ఫిర్యాదులు ఉన్నా ముందే పంచుకుని ఉండాల్సింది’’ అని అన్నారు. 70 శాతం సీట్లలో పోలింగ్ ముగిశాక, ప్రతిపక్ష కూటమి ముందంజలో ఉందన్న వార్తలు నడుమ మమత తీరులో మార్పు వచ్చిన విషయాన్ని కూడా అధీర్ రంజన్ చౌదరి ప్రస్తావించారు. ‘‘వాళ్లు (బీజేపీ) కాంగ్రెస్‌ను ఉండనీయమని పేర్కొన్నారు. హస్తం పార్టీకి 40 సీట్లు కూడా రావన్నారు. కానీ మమత చెబుతున్న దాన్ని బట్టి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నమాట’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలో చేరికను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తొలుత వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాను ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అనంతరం తన వైఖరిపై మరింత స్పష్టత ఇచ్చారు. తమ్లుక్‌లో తాజాగా ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఇండియా కూటమిలో భాగస్వామినే. ఇండియా కూటమి నా ఆలోచనల నుంచి పుట్టింది. జాతీయ స్థాయిలో మేము కలిసే ఉన్నాము. భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు సాగుతాం’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, బెంగాల్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ శాఖ, సీపీఎంను మాత్రం తాను పొత్తులో భాగస్వామిగా చూడట్లేదని అన్నారు.