top of page
MediaFx

వామ్మో.. బయటకు రాకపోవడమే మంచిది..

తెలుగు రాష్ట్రాలను భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు అడుగు బయటపెడితే అంతే సంగతులంటూ వార్నింగ్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పగటి ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవైపు రికార్డుస్థాయి ఎండలు, మరోవైపు దడ పుట్టిస్తున్న వడగాలులతో జనం భయపడుతున్నారు. దాదాపు 93 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్‌ మొదట్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలల్లో మండుటెండలు ఏ రేంజ్‌లో ఉంటాయో అని జనం భయపడుతున్నారు.

తెలంగాణలో ఎండలతో తొమ్మిది జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. 34 మండలాల్లో రికార్డుస్థాయిలో వడగాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు గత ఏడాది కన్నా మూడున్నర డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో, అంటే ఉమ్మడి విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలోని 6 మండలాల్లో వడగాలులు దడ పుట్టిస్తాయని చెబుతున్నారు. విజయనగరంలో 20, పార్వతీపురం మన్యంలో 8, అనకాపల్లిలో 11, కాకినాడలో 6, కోనసీమలో 4, ఏలూరులో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 7, పల్నాడులో 2, తూర్పుగోదావరిలో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

నిన్న నంద్యాల జిల్లా చాగల మర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైయస్సార్ జిల్లా ఖాజీపేట, సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపురి లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 107 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం కనిపించింది.

bottom of page