సాధారణంగా సినిమా స్టార్లకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు వీరాభిమానులు (Fans) ఉంటారు. ఆ సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా వెర్రి అభిమానంతో ఎగబడుతుంటారు. అయితే డిజిటల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు (YouTubers), ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సృష్టికర్తలకు కూడా అభిమానులు పుట్టుకొచ్చారు. వీరిని కూడా వెర్రిగా అభిమానించే జనాలు తయారవుతున్నారు. అమెరికా యూట్యూబర్ ఐషో స్పీడ్ (IShowSpeed) తాజా నార్వే (Norway) పర్యటన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. నార్వేలో అడుగుపెట్టిన ఐషో స్పీడ్‌కు అభిమానులు చుక్కలు చూపించారు. ఐషో స్పీడ్ అసలు పేరు డారెన్ వాట్కిన్స్ జూనియర్ (Darren Watkins Jr). యూట్యూబ్‌లో ఐషో స్పీడ్ ఛానెల్‌కు దాదాపు 2.5 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఎంతో ఆసక్తికర వీడియోలతో వారిని ఐషో స్పీడ్ అలరిస్తూ ఉంటాడు. అతను పోస్ట్ చేసే వీడియోలు చాలా హాస్యాస్పదంగా, వివాదాస్పదంగా ఉంటాయి. ఐషో స్పీడ్ ఒక్క వీడియో పోస్ట్ చేస్తే చాలు కోట్లలో సంపాదన ఉంటుంది. అతడు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ కోసం షార్ట్ వీడియోలను కూడా రూపొందిస్తుంటాడు. తాజాగా అతను లైవ్ స్ట్రీమింగ్ కోసం నార్వే వెళ్లాడు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఓ దుకాణంలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న నార్వే అభిమానులు ఐషో స్పీడ్‌ను చూసేందుకు పోటెత్తారు. ఐషో స్పీడ్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. నిమిషాల వ్యవధిలోనే ఆ షాప్ ముందు జనం గుమిగూడడం ప్రారంభమైంది. దీంతో ఐషో స్పీడ్ బయటకు రావడం చాలా కష్టంగా మారిపోయింది. దీంతో స్థానిక పోలీసుల సహాయం కోరాడు. వారు అక్కడకు వెళ్లి ఐషో స్పీడ్‌ను బయట ఉన్న కారు వరకు ఎంతో ప్రయాసపడి చేర్చారు. ఆ సమయంలో అభిమానుల దురుసు ప్రవర్తన ఐషో స్పీడ్‌కు చాలా ఆగ్రహం తెప్పించింది. దీంతో ఐషో స్పీడ్ సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లడించాడు. ``నేను మళ్లీ నార్వే వస్తానని అనుకును బ్రదర్. నేను నా నార్వే ఫ్యాన్స్‌ను అభిమానిస్తాను. కానీ, మీరు మాట వినడం లేదు. నేను చాలా దేశాలకు వెళ్లాను. అక్కడ ఎంతో సందడిగా, హుషారుగా గడిచింది. కానీ, ఇది చాలా అమానవీయం`` అంటూ ఐషో స్పీడ్ తన ఆవేదన వెళ్లగక్కాడు