top of page
MediaFx

కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..


కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బతికిస్తుందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అధిక కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. రాజధాని కోసం రూ.15 వేల కోట్లు కేటాయించినందుకు.. పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం: నాదేండ్ల

కేంద్ర బడ్జెట్‌పై జనసేన నేత నాదెండ్ల ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేశారు.. జనసేన తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇది అమరావతికి కూటమి పూర్వ వైభవం తెస్తుందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని.. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాను కేంద్రం పట్టించుకోలేదు.. సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి: షర్మిల

బడ్జెట్‌లో ప్రత్యేకహోదా సహా ఏపీప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని మాటలకు పరిమితమయ్యిందన్నారు షర్మిల.అమరావతికి రూ 15 వేల కోట్లు విదిల్చిందని.. దీనికి పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

bottom of page