top of page
MediaFx

పాములు పగబడతాయన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి.?


పాములు పగబడతాయని చాలా మంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తు పెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో, సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తు పెట్టుకుంటాయి. అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవు. నిజానికి చాలా వరకూ పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. మనుషులను గుర్తుపెట్టుకుని దాడిచేసేంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదు. ఒక వ్యక్తిపై పాములు పలు మార్లు దాడి చేసి కాటువేయడం యాధృచ్ఛికమే కావచ్చు. నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవు. అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్లిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్లిపోతాయి. కానీ, తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొడతాయి, లేదా కాటు వేస్తాయి. అంతే తప్ప… పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం మూఢ నమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలిగితే వాళ్లకు పాము చెవులున్నాయని అంటుంటారు. దీనర్ధం పాములకు చెవులున్నాయని కాదు. నిజానికి పాముకి బయటికి కనిపించేలా చెవులుండవు. కానీ వాటి శరీరంలో చెవులకు సంబంధించిన నిర్మాణాలు మాత్రం ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే మానవులకు ఉండేలా వాటికి చెవులు లేకపోవడంతో అవి నేరుగా శబ్దాలను వినలేవు. కేవలం వాటి వైబ్రేషన్లు మాత్రం సున్నితంగా గ్రహించగలవు. కర్ణభేరి అనే నిర్మాణం కూడా పాము చెవుల్లో ఉండదు. కాబట్టి అది నేరుగా శబ్దాలను వినలేదు. కానీ వెలుపలి చెవులు అదృశ్యమైన చోట కర్ణభేరీ రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవి నుంచి లోపలికి దారి తీస్తుంది. మధ్య చెవిలో ‘కాలుమెల్లా ఆరిస్‌’ అనే ఒక సున్నితమైన ఎముక ఉంటుంది. ఇది ఒకవైపు లోపలి చెవికి కలిపి ఉండగా, మరో వైపు దాని దవడ కింద చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలను ఈ కర్ణస్తంభిక ఎముక నిర్మాణం గ్రహించి చెవికి చేరుతుంది. అంటే పాములు నేలలో వచ్చే తరంగాలను (వైబ్రేషన్లను) మాత్రమే గ్రహించగలుగుతాయి. అయితే పాములు మనం వినే శబ్దాల్లో అతి తక్కువ భాగం మాత్రమే వినగలుగుతాయి. అందుకే సున్నితమైన శబ్దాల్ని వినగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లను పాము చెవులు ఉన్న వాళ్లని పిలుస్తారని ఆమె అన్నారు.

bottom of page