సన్యాసులు ఎక్కువగా కాషాయ రంగు ధరిస్తారు. హిందూ మతంలో కొన్ని శతాబ్దాలుగా సాధువులకు, సన్యాసులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. వారి ఆశీస్సులు పొందిన వారికి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. ఇంటి దగ్గరికి ఎప్పుడైనా సాధువులు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపించకూడదని చెబుతారు. వారికి కోపం తెప్పించడం మంచిది కాదని అంటారు. పవిత్రమైన పుణ్య నదుల దగ్గర కుంభమేళాల సమయంలో సన్యాసులు ఎక్కువగా కనిపిస్తారు. గుడిలో ధ్యానం చేసుకుంటూ దర్శనం ఇస్తారు. వాళ్ళు ఏదైనా చెప్పారంటే అది జరిగి తీరుతుందని చాలా మంది విశ్వాసం.
ఎక్కువ మంది సన్యాసులు కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే నలుపు, తెలుపు రంగు దుస్తులు వేసుకుంటారు. అయితే కాషాయ రంగు దుస్తులు ధరించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం.
సూర్యుడికి ప్రతీక కాషాయం రంగు సూర్యతేజాన్ని ప్రతిపాదిస్తుంది. సూర్యుడు ప్రతి ఒక్కరికి జీవనాధారం. చైతన్యానికి జ్ఞానానికి ప్రతీక. తమలోని అజ్ఞానాన్ని, చీకటిని విడిచిపెట్టి జ్ఞానాన్ని మేలుకొలపాలనే ఉద్దేశంతో యోగులు, సన్యాసులు, సాధువులు కాషాయ రంగు ధరిస్తారు. అందరిని సమానంగా చూసే గుణం కాషాయ రంగుకు ఉంటుందని చెప్తారు. ఈ రంగు అగ్నిక ప్రతీక. అహం, కామ క్రోధాలను విడిచి పెట్టాలని సూచిస్తుంది. మానసిక ప్రశాంతతను ఈ రంగు ఇస్తుంది.
శైవులు, సాధువులు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తారు. ఈ రంగు శక్తి, త్యాగానికి చిహ్నంగా పరిగణిస్తారు. కాషాయి రంగు దుస్తులు ధరించడం వల్ల మనసు అదుపులో ఉంటుందని, ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. అది మాత్రమే కాదు శరీరం ఎప్పటికైనా కలిసిపోవాల్సింది మట్టిలోనే. దీనికి ప్రతిబింబంగా ఈ రంగు దుస్తులు ధరిస్తారు. ఇది పవిత్రతను సూచిస్తుంది.
కాషాయ రంగు దుస్తులు ధరించడం వల్ల మనసులోని ఆందోళన నుంచి విముక్తి కలుగుతుంది. ప్రశాంతంగా ఉంటుందని ఎక్కువమంది ఈ రంగు దుస్తులు ధరిస్తారు. వీళ్ళు మాత్రమే కాకుండా హనుమంతుడిని ఆరాధించే భక్తులు కూడా ఎక్కువగా కాషాయ రంగు దుస్తులు ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ రంగు హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనది.