అసలు మనుషులు మద్యానికి ఎందుకు బానిసలుగా మారుతారన్న దాని గురించి లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కి చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం, ప్రజలు మద్యం సేవించడానికి ఇష్టపడడానికి RASGRF-2 అనే జన్యువు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన జన్యుశాస్త్రం, మెదడు రసాయన శాస్త్రంతో పాటు.. ఆల్కహాల్‌తో ఉన్న సంబంధాన్ని చెబుతుంది.
ఈ అధ్యయనంలో డోపపైన్ పాత్రకు సంబంధించి పరిశోధనలు నిర్వహించారు. డోపమైన్ అనేది మెదడులోని ఒక న్యూరోట్రాన్స్మిటర్. మనిషికి సంతోషం కలిగినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అలాగే రుచికరమైన ఆహారం తీసుకోవడం లేదా ఇష్టమైన సంగీతాన్ని విన్న సమయంలో మెదడులో డోపమైన్ స్థాయి పెరుగుతంది. ఇది బాధ నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది. RASGRF-2 జన్యువు ఆల్కహాల్ తాగినప్పుడు డోపమైన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జన్యువు ఉన్న వారిలో ఆల్కహాల్ తాగిన తర్వాత డోపమైన్‌లో ఎక్కువ పెరుగుదల ఉంటుందని, ఇది ఆనందం పొందే అవకాశాలను పెంచుతుందని పరిశోధనలో తేలింది. ఆల్కహాల్ వ్యసనానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధకులు సుమారు 14 సంవత్సరాల వయస్సు ఉన్న 663 మందిని పరిగణలోకి తీసుకున్నారు. RASGRF-2 జన్యువును కలిగి ఉన్న యువత జన్యువు లేని వారి కంటే చాలా తరచుగా మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇక పరిశోధనకు నాయకత్వం వహించిన రచయిత ప్రొఫెసర్ గుంటర్ షూమాన్ ప్రకారం.. మద్యపాన అలవాటును ప్రోత్సహించడంలో ఇతర జన్యువులు, పర్యావరణ ప్రభావం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే మద్యపానం సేవించడం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది మరణిస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.