top of page
MediaFx

ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీలు..

సార్వత్రిక ఎన్నికల పర్వంలో ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలైపొయ్యాయి. తామొస్తే ఏమిస్తామో చెప్పుకుంటూ మేనిఫెస్టోల మేజిక్‌ని జోరుగా షురూ చేశాయి జాతీయ పార్టీలు. ఈ విషయంలో మేమే ఫస్ట్ అంటూ హామీల పుస్తకాన్ని జనం ముందుంచింది హస్తం పార్టీ. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిందాన్ని గుర్తు చేస్తూ ఈసారి అంతకుమించి చేస్తాం.. అంటూ గట్టిగానే వాగ్దానం చేస్తోంది. ఆలిండియా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను, అందులోని గ్యారంటీల పరంపరను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న మోదీ చరిష్మాను, ఆయనిస్తున్న గ్యారంటీ సౌండ్‌ను గ్యారంటీలతోనే తిప్పికొట్టాలని డిసైడైంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే.. పాంచ్ న్యాయ్.. పచీస్ గ్యారంటీస్.. అంటూ 48 పేజీల మేనిఫెస్టోకు కలర్‌ఫుల్ టచింగ్ ఇచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా, రాహుల్‌ సమక్షంలో ఢిల్లీలో విడుదలైంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు లాంటి సాదాసీదా గ్యారంటీలతో పాటు.. యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన లాంటి సీరియస్ ప్రామిస్‌లు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనిపిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ తన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ద్వారా ఈ మేనిఫెస్టోని ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లారు.

ఇలా ఐదు వర్గాలకు ఐదు రకాల న్యాయం అందిస్తామని మాటిస్తోంది కాంగ్రెస్ పార్టీ. వీటికి పాతిక గ్యారంటీల్ని కూడా జోడించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో పేద ప్రజలకు అంకితమన్నారు మల్లికార్జున ఖర్గే. 23 కోట్ల మందిని పేదరికం నుంచి బైటికి తీసుకొస్తామని మాటిచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో అంబానీ, అదానీల కోసమని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఆమ్‌ఆద్మీల కోసమని తనదైన డెఫినిషన్ ఇచ్చుకున్నారు రాహుల్‌గాంధీ. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ జరుగుతుందట. విద్యారుణాలు మాఫీ చేయడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు చేస్తామంటూ యువతను మెస్మరైజ్ చేస్తోంది కాంగ్రెస్ మేనిఫెస్టో. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, జమ్ము కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా లాంటి ప్రామిస్‌లు కూడా ఇక్కడ ఆసక్తికరం. ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు పెగాసెస్ లాంటి కుంభకోణాలపై విచారణ జరిపిస్తామంటోంది హస్తం పార్టీ. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకొస్తేనే, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి ఐతేనే ఇవన్నీ చెయ్యగలమని చెప్పకనే చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. కానీ.. ఇండీ కూటమి ఉమ్మడి అభ్యర్థి కాన్సెప్ట్‌ని వర్కవుట్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఫ్యూచరేంటి.. ? ఐతే కామ్రేడ్లకు, కాంగ్రెస్‌కీ మధ్య పొత్తు ప్రసక్తులే లేని తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి అభ్యర్థి కాన్సెప్ట్ ఏమైనట్టు..? ఇన్ని ప్రశ్నల నడుమ దేశవ్యాప్తంగా ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో.

bottom of page