top of page
Suresh D

యాత్ర 2 సినిమా టీజర్ వచ్చేస్తోంది.. డేట్, టైమ్ ఇదే🎥🎉

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర మూవీ తెరకెక్కింది. 2019 ఏపీ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. ఈ చిత్రానికి మహీ వి.రాఘవ్ దర్శకత్వం వహించగా.. రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి పోషించారు. ఇప్పుడు, యాత్ర చిత్రానికి సీక్వెల్‍గా యాత్ర 2 వస్తోంది. 2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర, ముఖ్యమంత్రిగా గెలిచిన కథాంశాలతో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 8న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో యాత్ర 2 టీజర్ రిలీజ్ డేట్, టైమ్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది.

యాత్ర 2 సినిమా టీజర్ జనవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు మహీ వి.రాఘవ్ వెల్లడించారు. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ట్వీట్ చేశారు. ఈ పోస్టర్‌లో మమ్మూటి (రాజశేఖర రెడ్డి) కుర్చీలో కూర్చొని ఉండగా.. జీవా (జగన్) ఆయన వెనుక నిలబడ్డారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాత్రను యాత్ర 2లో తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.

యాత్ర 2 చిత్రంలో వైఎస్ భారతిగా కేతకి నారాయణ్, సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెట్ నటిస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్, రాజీవ్ కుమార్ అనేజా కీలకపాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్ పతాకాలపై శివ మేకల, మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఫిబ్రవరి 8న యాత్ర 2 వస్తుండటంతో రాజకీయంగానూ ఈ చిత్రం కీలకంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఏపీలో 3వేల కిలోమీటర్లపైగా పాదయాత్ర చేశారు. 2017 నుంచి 2019 జనవరి వరకు ఈ యాత్ర జరిగింది. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.🎥🎉

bottom of page