సీఎంగా అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాలని నాగబాబు తీవ్రంగా విమర్శించారు. ‘‘రైతులు ఆత్మహత్య చేసుకుంటే జరగలేదని చెప్పాడు. కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణంగా జగన్ ప్రచారం చేశాడు. నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్‌కు సిగ్గుండాలి. ఇంతకంటే దిగజారకండి అనిచెప్పే కొద్దీ ఇంకా దిగజారుతున్నారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణ యుగం నడుస్తుంది. కేంద్రం సహకారంతో ప్రజా పాలన అందరూ చూస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను నాగబాబు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
‘‘జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్ధంగా పని చేశారు. మా పార్టీ కోసం పని చేసిన వారి కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఆయన కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అధినేత అండగా నిలిచారు. రూ.17.45 కోట్లు ఇప్పటివరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని చెప్పారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఎన్నో ఇబ్బందులు చూశాం. అనారోగ్యం పెద్దది అయితే చికిత్సకు డబ్బులు లేని పరిస్థితి. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం అనేక పాట్లు పడుతుంది. జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే మా అధ్యక్షులు ఇలా భరోసా ఇచ్చారు’’ అని నాగబాబు పేర్కొన్నారు.