ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో ఏ వృత్తిలో అయినా ఒత్తిడి తప్పనిసరి. ఆర్థిక, వృత్తి పరమైన లక్ష్యాల సాధనలో నిరంతరం పని చేయాల్సిన పరిస్థితులు యువతపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఒత్తిడికి ఉపశమనం పొందేందుకు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, భగవంతుడే అంతిమ సత్యం అని గ్రహించేందుకు యువత ఆధ్యాత్మికత వైపు మళ్ళుతున్నారు.
కరోనా కల్లోలాన్ని అనుభవించిన తర్వాత, జీవితంలోని కల్లోల పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కరోనా సమయంలో అనేకమంది ప్రియమైన వారిని కోల్పోయి, ఆస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ అనుభవాలు భారతీయుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచాయి.
గతంలో వెకేషన్ అంటే బీచ్‌లకు వెళ్లడమే అనుకునే వారు, ఇప్పుడు ఆలయాల సందర్శనకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆలయాలు, చార్ ధామ్, అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు యువత పోటీ పడుతున్నారు. పుణ్యక్షేత్ర దర్శనం, పర్యాటక ప్రాంతాల సందర్శన కలిపి ఉన్న టూరిజం ప్యాకేజీలతో ట్రావెల్ కంపెనీలు భారీగా లాభాలను సాధిస్తున్నాయి.
ఆధ్యాత్మిక పర్యాటకం, మతపరమైన పర్యాటకంగా పిలుస్తున్న ఈ ట్రెండ్‌తో ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా లాభాలు వస్తున్నాయి. ఏటికేడు ఆదాయం రెట్టింపవుతోంది. ఆధ్యాత్మిక భావం, మనసును ప్రశాంతంగా ఉంచుకునే పరిస్థితులు, జీవితంలో ఎదురైన సమస్యలకు పరిష్కారాలు పొందడంలో ఆధ్యాత్మికత వల్ల కలిగే ప్రశాంతత, ఆలోచనల్లో వచ్చే సానుకూల మార్పు యువతను ఆధ్యాత్మిక పర్యటనల వైపు ఆకర్షిస్తోంది.