top of page
MediaFx

ఏపీలో శాంతిభద్రతలు లోపించాయంటూ నిరసన..వైఎస్‌ జగన్‌ ధర్నా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. శాంతి, భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ పోరు బాట పడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరసన గళం వినిపించారు. జంతర్ మంతర్‌ దగ్గర వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలంతా ధర్నాలో పాల్గొన్నారు. ఏపీలో ఈ మధ్య జరిగిన ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఇవాళ్టి ధర్నాతో ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు జగన్. గడిచిన 50 రోజుల్లో 36 మందిని హత్య చేశారని జగన్ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించిన జగన్, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో పలు జాతీయ పార్టీల నేతల్ని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించి.. మద్దతు కోరనున్నారు.


bottom of page